
కామారెడ్డి, వెలుగు : పెండింగ్‌లో పెట్టిన జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. శానిటేషన్, వాటర్‌వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న 300 మందికి పైగా కార్మికులకు మూడు నెలల జీతాలు ఇవ్వడం లేదంటూ మున్సిపల్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో నిత్యావసరాలు తెచ్చుకోవడం, కిరాయిలు చెల్లించడం, స్కూల్ ఫీజులు కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి తమ జీతాలను చెల్లించడంతో పాటు, అకారణం తొలగించిన 12 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.